AP: వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు

AP: వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు
గాల్లోకి కాల్పులు జరిపిన వినుకొండ టౌన్ సీఐ సాంబశివరావు

పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ వర్గాల పరస్పర సవాళ్లతో అక్కడి రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో బస్టాండ్‌ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. మరోవైపు.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు వినుకొండ టౌన్ సీఐ సాంబశివరావు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. గాల్లోకి కాల్పులు జరిపిన సీఐ.. తమ కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినుకొండ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ జీవీ ఆనంజనేయులుపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ర్యాలీకి ఎదురుపడ్డారు. కారు దిగి టీడీపీ నాయకులకు సవాల్‌ విసిరి రెచ్చగొట్టారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్ధమన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అటు.. టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోవాలంటూ వినుకొండ సీఐ హెచ్చరించారు. అనంతరం సీఐ గాల్లోకి కాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story