TDP Celebrations: కూటమి విజయంతో - రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించడంతో 3 పార్టీల శ్రేణులు, నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఎక్కడికక్కడ టపాసులు పేల్చి కేక్‌లు కట్ చేసి ఆనందం పంచుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్ గెలుపొందడంతో కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అవనిగడ్డ ప్రధాన సెంటర్‌లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. నెల్లూరులో మాజీమంత్రి నారాయణ నివాసం జన కోలాహలంతో నిండిపోయింది. 'అభినందనలు నారాయణ మాస్టార్' అంటూ... సన్మానాలతో నారాయణను ముంచెత్తారు.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై... దేశ విదేశాల్లోని తెలుగుదేశం అభిమానులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. లండన్‌లో తెదేపా ఎన్ఆర్ఐ విభాగం సభ్యురాలు ఉప్పాల రత్నశ్రీ ఆధ్వర్యంలో పలువురు ప్రవాసాంధ్రులు కుటుంబసభ్యులతో కలిసి కూటమి సంబరాలు చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడంతో... అనంతపురంలో నిరుద్యోగ యువత సందడి చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. అఖండ మెజారిటీతో గెలుపొందిన అమిలినేని సురేంద్ర బాబుకు కళ్యాణదుర్గం ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు అనంతరం అక్కమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల తెలుగుదేశం కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన N.M.D. ఫరూక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో గుంటూరు జనసేన కార్యాలయంలో... విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన నారా చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు ఆ పార్టీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ప్రజలకు మిఠాయిలు పంచి పెట్టారు. వైకాపా అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు గంటి హరీష్ మాధుర్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com