AP: ఓ వైపు ఇంజనీర్లు.. మరోవైపు టీచర్లు

AP: ఓ వైపు ఇంజనీర్లు.. మరోవైపు టీచర్లు
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదంటూ జగన్‌ సర్కార్‌కు హెచ్చరికలు

ఉన్నతాధికారులు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజినీర్లు హెచ్చరించారు. విజయవాడలో జరిగిన పంచాయతీరాజ్ ఇంజినీర్ల రాష్ట్రస్థాయి కార్యనిర్వాహక సమావేశానికి..... సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. గుత్తేదారులకు ప్రభుత్వం చెల్లింపులు చేయకుండా తమను బాధ్యుల్ని చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు. చెల్లింపులు క్రమం తప్పకుండా జరిగితేనే పనులు చేయగలమని పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు, ప్రధాన కార్యదర్శి సంగీతారావు స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం 12వేల కోట్ల విలువైన 40వేల భవనాలను ఒకేసారి మంజూరు చేసిందని, దశలవారీగా చేపట్టాలని సూచించినా వినకుండా ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం విధించిందని గుర్తుచేశారు. కరోనా కారణంగా 2021 నుంచి ప్రారంభించి... ఇప్పటికి 50 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పుడు నాలుగేళ్ల పనులను 4 నెలల్లో పూర్తి చేయాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇంజినీర్లపై... కొందరు జిల్లా కలెక్టర్లు చర్యలకు ఉపక్రమించారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీఆర్ ఇంజినీర్ల సంఘం నేతలు స్పష్టం చేశారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో CPS రద్దు చేయలేదన్న ఆవేదనతో అనంతపురం జిల్లా పెన్న అహోబిళంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఐదు పేజీల లేఖ రాసి..సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ..మల్లేశ్ లేఖలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు సహా ప్రతి నెలా 5వ తేదీకల్లా జీతాలు ఇవ్వడమే చివరి కోరికలంటూ..లేఖలో ప్రస్తావించారు. విషపు గుళికలు మింగిన ఉపాధ్యాయుడిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన చావుకు సీఎం జగనే కారణమని బాధితుడు లేఖ రాశారు. సీఎం జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు, 5వ తేదీ కల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అంటూ లేఖలో ఉపాధ్యాయుడు మల్లేశ్ వెల్లడించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. C.P.S రద్దు చేయలేదన్న బాధతో అనంతపురం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యయత్నం చేయడంపై ఉపాధ్యాయ లోకం భగ్గుమంది. తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఆ ఉపాధ్యాయుడు లేఖ రాశాడంటే... ఉపాధ్యాయుల జీవితం ఎంత దుర్భరంగా ఉందో ప్రభుత్వం ఆర్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా కళ్లు తెరిచి ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష‌్కరించాలని... లేని పక్షంలో రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని టీచర్స్ యూనియన్స్ ప్రతినిధులు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story