CMS MEET: సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. పెండింగ్ సమస్యలను మూడంచెల విధానంలో పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల నుంచి చెరో ముగ్గురు అధికారులతో ఒక కమిటీ, రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీల ద్వారా కూడా పరిష్కారమవని వాటిపై ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఉమ్మడిగా యుద్ధం చేయాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు.
పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా.. అధికారులకు ముఖ్యమంత్రులు కీలక సూచనలు చేశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు, రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను తెలిపారు. అన్నింటిపైనా విస్తృతంగా చర్చించి, ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు. సీఎస్‌లు, మంత్రుల కమిటీల పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో సీఎస్‌ల ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తమకు తిరిగివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని, ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు కావాలని ఏపీ అధికారులు కోరారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి నిరాకరించారు. తెలంగాణ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లో స్థిరాస్తులు ఇచ్చే పరిస్థితి లేదని, ఏపీ ప్రభుత్వం తరఫున దరఖాస్తు చేసుకుంటే స్థలం కేటాయిస్తామని, భవనాలు నిర్మించుకోవాలని రేవంత్ సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com