TS: రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల

రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేని BRS.. గ్రామ సభలకు అడ్డు తగులుతుందని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ ఇచ్చినందుకు రైతు దీక్ష చేస్తున్నారా అని ప్రశ్నించారు.
లెక్క తేల్చిన అధికారులు
అధికారులు రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం రూ.8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క తేల్చారు. ఇలాంటివి 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి, ఆ భూముల సర్వే నెంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు.
ఎప్పటినుంచంటే..?
జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పిన రైతు భరోసా పథకం కింద రూ. 12 వేలు ఇస్తామని తాజాగా ప్రకటించింది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ఎకరాకు ఏడాదికి రూ. 10 వేలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. అప్పుడు 'రైతుబంధు' పేరిట ఈ సాయం అందేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పథకం పేరు మార్చడంతోపాటు మరో రూ. 2 వేలు పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పడింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వరాదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన కీలక సిఫార్సు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం, తెలంగాణలో దాదాపు 74 లక్షల మంది పట్టాదారులున్నారు. సుమారు కోటి 58 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com