ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశంసలు..

ఏపీ ప్రజలను ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసించారు. వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. వరద నీటిలో 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. తన అనుభవంతో విపత్తు నుంచి ప్రజలను రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు.
మల్లారెడ్డి ఈరోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తిరుమలకు ఆయన అలిపిరి నడక మార్గం గుండా చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తిరుమలకు వచ్చారు.
మల్లారెడ్డి పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారాన్ని తోసి పుచ్చారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పారు. ఒకవేళ వెళ్తే ఆ విషయాన్ని తానే తెలియజేస్తానని చెప్పారు. తెలంగాణకు పూర్వ వైభవాన్ని కేసీఆర్, కేటీఆర్ మళ్లీ తీసుకువస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com