REVANTH: నీట్‌పై న్యాయ విచారణ జరపాలి

ప్రధాని మోదీ పాలనలో జాతీయ స్థాయి పరీక్షల్లో వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని విమర్శించారు. కోట్లమంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన అంశంపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. పరీక్షల్లో వివాదాలకు కారకులైన వారికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ప్రధాని మౌనం వహించడం సరికాదని రేవంత్ మండిపడ్డారు. ఎవరిపైనో కేస్ వేసి ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని... అందుకే సీబీఐకి కేసు అప్పగించారని రేవంత్ అన్నారు. నీట్ పరీక్ష రద్దు, అవకతవకలపై న్యాయ విచారణ అవసరమని రేవంత్ అన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన భరోసా ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వట్లేదన్నారు. మోడీ గ్యారెంటీ ఎక్కడ పోయిందని.. మోడీ గ్యారంటీ ఖతం అయిందని రేవంత్ అన్నారు. ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల విమర్శలు
నీట్ యూజీ సహా జాతీయ పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మొత్తం విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం మాఫీయా, అవినీతిపరులకు అప్పగించిందని ఇప్పటికే ప్రియాంక గాంధీ మండిపడ్డారు. దేశంలోని ప్రముఖ పరీక్షల దుస్థితికి ఇది కారణమని... భారతీయ జనతా పార్టీ పాలనలో మొత్తం విద్యావ్యవస్థ మాఫియా, అవినీతి పరులకు అప్పగించారని ప్రియాంక ఆరోపించారు. దేశ విద్య వ్యవస్థను, పిల్లల భవిష్యత్తును అత్యాశపరులకు, మతోన్మాద అసమర్ధులకు అప్పజెప్పాలన్న రాజకీయ నేతల దురహంకారం వల్ల పేపర్ లీక్‌లు, పరీక్షల రద్దులు జరుగుతున్నాయని ప్రియాంక మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వ పాలనలో క్యాంపస్‌ల నుంచి విద్య మాయమవుతోందని... రాజకీయ గూండాయిజం మన విద్యావ్యవస్థకు గుర్తింపుగా మారిందని విమర్శించారు. భాజపా ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. యువత భవిష్యత్తుకు భాజపా అతిపెద్ద అడ్డంకిగా మారిందని మండిపడ్డారు. దేశంలోని సమర్ధులైన యువత తమ విలువైన సమయాన్ని, శక్తిని.. భాజపాపై పోరాడేందుకు వృథా చేస్తున్నారని... ప్రధాని మోదీ నిస్సహాయంగా మారి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com