REVANTH: ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదు: రేవంత్‌రెడ్డి

REVANTH: ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదు: రేవంత్‌రెడ్డి
X
ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా.. అసలు పేదలకు బీఆర్‌ఎస్ చేసిందేంటీ..?

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని, మూసీ ప్రాంత పేదల జీవితాలు బాగుపడొద్దా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రాంతంలో 10 వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. మూసీ ప్రక్షాళన కోసం.. మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి బాధితులను ఆదుకోలేమా? అంటూ సీఎం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మూసీ నది అంటే మురికి కూపం అనే పేరు స్థిరపడిపోయిందని అన్నారు. ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లతో ఎవరి భూములు పోలేదా? మల్లన్నసాగర్ పరిధిలో రైతులను కొట్టి, తొక్కించి, బలవంతంగా ఖాళీ చేయించారు కదా అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతోందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏనాడైనా పేద ప్రజల కోసం ఏమైనా చేశారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. అనవసర విమర్శలు పక్కనబెట్టి, మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వాలని విపక్షాలకు సూచించారు.

పిల్లల్లకు పేర్లు పెట్టేంత మార్పు తెస్తాం

తల్లిదండ్రులు తమ పిల్లలకు గంగ, యుమున, సరస్వతి అనే పేర్లతో పాటు మూసీ పేరు కూడా పెట్టే విధంగా ఆ నదిని ప్రక్షాళన చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నేతల పదేళ్ల దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు..రేవంత్‌రెడ్డి. ఈటల రాజేందర్‌ పార్టీ మారినా ఇంకా బీఆర్‌ఎస్‌ పక్షానే మాట్లాడుతున్నారని..మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మూసీ ఒడ్డున క్యాట్‌వాక్‌ చేయకుండా.. వారం రోజులు అక్కడే నివసిస్తే అక్కడి ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని సూచించారు..రేవంత్‌రెడ్డి.

’మూసీ ప్రక్షాళన.. ఓ యజ్ఞం‘

మూసీ ప్రక్షాళనపై విపక్షాలు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మూసీ పరీవాహక వాసులకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. మూసీ నీటిని పంటలకు వినియోగించడంతో దిగుబడి పడిపోతోందన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా పనులు కొనసాగుతాయని టీపీసీసీ అధ్యక్షుడు మహే‌ష్ కుమార్‌గౌడ్‌ అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పనులు మహాయజ్ఞం లాంటివన్నారు. భవిష్యత్‌ తరాల కోసమే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందన్నారు.

Tags

Next Story