vemulawada: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి దిశా అడుగులు పడుతున్నాయి. ఆలయ అభివృద్ధికి సోమవారం రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయించింది. వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం రూ.47.85 కోట్లు మంజూరు చేసింది. బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల వరకు డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రోడ్లు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన తదుపరి చర్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, వేలములవాడ ఆలయ పాలకవర్గం చేపట్టాలని దానకిషోర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com