Krishna Teja: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OSDగా యువ IAS..

Krishna Teja:  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OSDగా యువ IAS..
X
ప్రత్యేక అనుమతి ఇచ్చిన చంద్రబాబు, కేంద్రానికి లేఖ

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ రానున్నారు. సాధారణంగా ఆర్‌డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్‌డీలుగా నియమిస్తారు. అయితే పవన్‌కల్యాణ్‌ కోసం.. ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ రెండు రోజుల కిందట సచివాలయంలో పవన్‌కల్యాణ్‌ను కలిశారు.కృష్ణతేజ ను నియమించుకుంటే తన శాఖలకు సంబంధించిన వాటిలో కొన్ని సంస్కరణలు తేవచ్చని పవన్ భావించడం వల్లనే ఆయన నియామకానికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారు.

త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్‌ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన.. 2023 మార్చిలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి.. దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతోపాటు 150మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తున్నారు.

Tags

Next Story