temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి విశ్వరూపం

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మే నెల ముగింపు దశకు చేరుతున్నప్పటికీ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్లుగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో కూడిన వాతావరణం సాధారణ ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రహదారులు నిర్మానుష్యంగా కనిపించే పరిస్థితులు నెలకొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు మినహా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి వేసవికాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భానుడి ప్రతాపం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఇక రాబోయే రోజుల్లో కూడా ఎండల తీవ్రత కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం 74 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, మరో 232 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. విజయనగరం, మార్కాపురం ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉండగా, శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే రాబోయే మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమొరిన్ ప్రాంతం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. తీవ్ర ఎండలు, వడగాలుల పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతో పాటు తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
