KRMB: కేంద్ర బలగాల చేతుల్లోకి నాగార్జున సాగర్‌

KRMB: కేంద్ర బలగాల చేతుల్లోకి నాగార్జున సాగర్‌
కొనసాగుతున్న ఉద్రిక్తత... ఏపీ చర్యలపై కేఆర్‌ఎంబీకీ తెలంగాణ ఫిర్యాదు

నాగార్జునసాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల వివాదం అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. ఏపీ చర్యలపై నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసి తక్షణమే నీటి విడుదల ఆపివేయాలని బోర్డు స్పష్టం చేసింది. జరిగిన పరిణామాలను కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లింది.కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కృష్ణాబోర్డు చైర్మన్ శివ నందన్ కుమార్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాల నిర్వహణ, రెండు రాష్ట్రాల వైఖరి, బోర్డు చేపట్టిన చర్యలను ఆయన కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిసింది. గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లుగా ఉమ్మడి జలాశయాలు, సంబంధిత కాంపోనెంట్లను రెండు రాష్ట్రాలు బోర్డుకు స్వాధీనం చేస్తే సమస్యలు తలెత్తవని చెప్పినట్లు సమాచారం.


జరిగిన పరిణామాలు, బోర్డు స్వాధీనానికి సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖలో నివేదించినట్లు తెలిసింది. ఉద్రిక్తత నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా నవంబర్ 28 కంటే ముందు స్థితిని కొనసాగిస్తూ నాగార్జునసాగర్ డ్యాంను కేంద్ర సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో CRPF బలగాలు శుక్రవారం రాత్రికే నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్‌కు చేరుకున్నాయి. డ్యామ్‌ను ఆధీనంలోకి తీసుకుని భద్రతను పర్యవేక్షించనున్నారని సమాచారం. KRMB ఆదేశాల మేరకు CRPF బలగాలు పనిచేయనున్నాయి.


అటు కేంద్ర జల శక్తి శాఖ ఇవాళ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో హైబ్రిడ్ మోడ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డు చైర్మన్లు ప్రత్యక్షంగా పాల్గొంటారు. CRPF, CISF డైరెక్టర్ జనరళ్లను కూడా..సమావేశానికి పిలిచారు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తత తొలగించడంతోపాటు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు స్వాధీనం చేసే విషయంపై సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది. . ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తత తొలగించడంతోపాటు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు... సంబంధించిన కాంపోనెంట్లను కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు స్వాధీనం చేసే విషయంపై సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.

Tags

Next Story