AP: రేపే గ్రూప్-2 మెయిన్స్‌.. కొనసాగుతున్న ఉత్కంఠ

AP: రేపే గ్రూప్-2 మెయిన్స్‌.. కొనసాగుతున్న ఉత్కంఠ
X
నేడే హైకోర్టులో విచారణ... కీలక హామీ ఇచ్చిన లోకేష్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం జరగాల్సిన గ్రూపు-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలుచోట్ల అభ్యర్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా చూడాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ లప్రభుత్వంలో 2023 డిసెంబరులో గ్రూపు-2 షార్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారని... పూర్తి వివరాలతో మరో నోటిఫికేషన్‌ మూడు వారాల అనంతరం విడుదలచేశారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికోద్యోగుల కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించి ముందుగానే రోస్టర్‌ పాయింట్లు నిర్ధారించారని... దీనివల్ల అన్ని కేటగిరీల్లోని ప్రతిభావంతులైన జనరల్‌ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రోస్టర్‌లో లోపాలు సరిచేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇదే విషయంపై హైకోర్టుకు వెళ్లగా సింగిల్ జడ్జ్ ధర్మాసనం పరీక్షల వాయిదాకు నిరాకరించింది. దీంతో అభ్యర్థులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

లోకేశ్ కీలక హామీ

గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గ్రూప్-2 పరీక్ష అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకున్నామని, పరీక్ష వాయిదాపై లీగల్ టీమ్ తో మాట్లాడతామన్నారు. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అభ్యర్థులు సంయమనం పాటించాలని, ఆందోళన చెందొద్దని మంత్రి లోకేశ్ సూచించారు.

సీఎం చర్చించాలి: షర్మిల

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మద్దతు తెలిపారు. గ్రూప్ 2 అభ్యర్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించాలని సూచించారు. నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో వ్యక్తం చేస్తున్నప్పుడు హడావిడిగా పరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఏంటని షర్మిల ప్రశ్నించారు.

గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

అనంతపురం జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. నగరంలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించే SSBN, ఎస్వీ డిగ్రీ కళాశాలల్లో ఆయన తనిఖీలు చేశారు. అక్కడ అధికారులు చేసిన ఏర్పాట్లపై అరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Tags

Next Story