ap: పదో తరగతి పరీక్షల్లో తెలుగు మీడియంపై సందిగ్ధత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో తెలుగు మీడియంలో పరీక్ష ఉంటుందా? లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తెలుగు మీడియంలో పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో టీచర్లు, విద్యార్థుల్లోనూ అయోమయం ఏర్పడింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతను ఇవ్వాల్సి ఉందని కోరుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒకే మాధ్యమం అమలు చేయాలంటూ 2021 డిసెంబరు 15న ఆదేశాలు జారీ చేశారు. 2020-21లో ఒకేసారి 1-6 తరగతుల్లో తెలుగుమాధ్యమాన్ని రద్దుచేసి.. ఆంగ్ల మీడియంలోకి మారుస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు జీఓను రద్దు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదు. తెలుగు మాధ్యమం రద్దు అంశం న్యాయస్థానంలో ఉన్నందున 2021 డిసెంబరులో ఒకే మాధ్యమం ఉంటుందంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్ల మాధ్యమం అని పేర్కొనకుండా ఒక్కటే మాధ్యమం అని ఉత్తర్వుల్లో నిర్వచించింది. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తూ పాఠశాలల్లో క్రమబద్ధీకరణ జరిప విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించింది. ఏ మాధ్యమం అమలు చేయాలన్నదానిని ప్రస్తావించకపోవడంతో చాలా చోట్ల ఉపాధ్యాయులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. ఇలా కొనసాగుతూ వచ్చిన విద్యార్థులు ఇప్పుడు పదోతరగతిలో ఉన్నారు. వీరికి తెలుగు మాధ్యమంలోనే పరీక్షలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com