TGPSC: గ్రూప్‌-1 పరీక్షపై నేడే కీలక ప్రకటన

TGPSC: గ్రూప్‌-1 పరీక్షపై నేడే కీలక ప్రకటన
X
పరీక్ష జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ... ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడం.. వారికి ప్రతిపక్షాలు సైతం మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 21వ తేదీ నుంచి మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ పరీక్షలను కొద్దిరోజులు వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ పట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. శనివారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇందులో గ్రూప్‌-1 మెయిన్స్, జీవో 29 అంశంపై చర్చించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

జీవో-29పై అభ్యంతరాలు..

జీవో-29పై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో వల్ల రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలో మొదటి 50 మందిని మెరిట్‌లో, తరువాత 50 మందికి రిజర్వేషన్లు వర్తించే ప్రక్రియ ఇప్పటిరవకు కొనసాగుతుండగా.. మెరిట్‌లో సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కోటా సీట్లలో లెక్కించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో ఎంతోమంది అభ్యర్థులు నష్టపోతారని కొందరు చెబుతుండగా.. ప్రభుత్వం మాత్రం జీవో29తో ఎవరికి నష్టం ఉండదని చెబుతోంది. ఓవైపు గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా.. వారికి విపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి.


రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగనున్నాయని, జీవో మీద అభ్యంతరాలు ఉంటే మొదట్లో చెబితే మార్చేవాళ్లమని వెల్లడించారు. కాబట్టి ఈ చివరి దశలో అర్ధాంతరంగా పరీక్షలను ఆపడం కుదరదని తేల్చి చెప్పారు.

మెయిన్స్ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు: డీజీపీ

గ్రూప్ -1 మెయిన్స్ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. పరీక్షకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పరీక్షలకు జరుగుతాయని, నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అభ్యర్థులపై లాఠీఛార్జ్.. మండిపడ్డ బండి

అశోక్ నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన గ్రూప్స్ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రూప్‌-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని, గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడం దారుణమని, న్యాయం కోరితే రక్తం కళ్ల చూస్తారా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Tags

Next Story