
ఫెంగాల్(ఫెయింజాల్) తూఫాన్ శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పడిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. కోత దశలో ఉన్న వరిపంట నేల వాలడంతో అన్నదాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిక్కోలు జిల్లాలో దాదాపు మూడు వేల హెక్టార్లలో వరి పంట నీటి ముంపునకు గురైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చినట్టే వచ్చి నీటి పాలయ్యిందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ పంట నష్టపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలోనే చాలామంది వరి పంట కోతలు నిలుపుదల చేసినప్పటికీ వందలాది మంది రైతులు ముందుగానే కోతలు చేయడంతో పొలాల్లో ఉన్న పంట పూర్తిగా నీటిపాలైంది. పొలాల్లో నీటి ముంపు కారణంగా ధాన్యం తడిసి ముద్దయింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాదాపు 53వేల క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. గడిచిన మూడు రోజులుగా పడిన వర్షాలకు పొలాల్లో ఉన్న పంటతో పాటు ఆరుబయట ఆరవేసిన ధాన్యం రంగు మారి తడిచి ముద్దైంది. విక్రయానికి వీలు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులుగా 10 మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com