TTD: వైకుంఠ ద్వార దర్శనాల రోజుల్లో టీటీడీ కీలక నిర్ణయాలు..

TTD: వైకుంఠ ద్వార దర్శనాల రోజుల్లో టీటీడీ కీలక నిర్ణయాలు..
TTD: ఈ ఏడాది కూడా పది రోజులపాటు జనవరి 13 నుండి 22వ తేదీ వరకు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచనున్నారు..

TTD: నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనాల రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి పది రోజులపాటు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. ఆ పది రోజుల్లో దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

గతంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచేవారు. ఆగమ పండితులు అంగీకారంతో గతేడాది నుండి వైకుంఠ ద్వారాలను పదిరోజులు తెరిచి ఉంచుతోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా పది రోజులపాటు జనవరి 13 నుండి 22వ తేదీ వరకు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచనున్నారు..

వైకుంఠ ద్వార ప్రవేశానికి ప్రతి రోజు 45 వేల మంది భక్తులకు దర్శనాలు కేటాయించనున్నట్లు ధర్మారెడ్డి చెప్పారు. శ్రీ‌వారి ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్పనిస‌రిగా తీసుకురావాల‌ని టీటీడీ సూచించింది. వైకుంఠ ద్వార ద‌ర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు కోవిడ్ ల‌క్షణాలు ఉంటే ప్రయాణం వాయిదా వేసుకోవాల‌ని కోరారు.

ఇక స్థానికులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తిరుప‌తిలో స్థానికుల కోసం 5 ప్రాంతాల్లో కౌంట‌ర్లు ఏర్పాటు చేసి రోజుకు 5 వేలు చొప్పున మొత్తం 50 వేల టోకెన్లు కేటాయిస్తామ‌ని, ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో స్థానిక భ‌క్తులకు మాత్రమే ఆఫ్‌లైన్‌ టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రెండవ ఘాట్ రోడ్డులో మరమ్మత్తు పనులు పూర్తిచేసి జనవరి 11వ తేదీకి ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జనవరి 1 తో పాటు వైకుంఠద్వారాలు తెరచి ఉంచే పదిరోజులు 24 గంటల పాటు ఘాట్ రోడ్లు తెరచి ఉంటాయని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story