Kadambari Case: రిమాండ్ రిపోర్ట్ లో ఐపీఎస్ ల పేర్లు

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో మరిన్ని సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఏ1 నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇందులో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు. నిందితులుగా పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను ఈ రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఏ2గా పీఎస్‌ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్‌జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్‌గున్నీ పేర్లు చేర్చారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురిని సస్పెండ్ చేసింది.
విద్యాసాగర్‌తో కాంతిరాణా, ఆంజనేయులు, విశాల్‌గున్నీ కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. కాదంబరి జెత్వానిని అక్రమంగా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. జెత్వానిని చేయాలని ఈఏడాది జనవరి 30న కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలను పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశించారు. ఫిబ్రవరి 1న ముంబై వెళ్లే పోలీసు బృందానికి అప్పటి సీపీగా ఉన్న కాంతి రాణా విమాన టిక్కెట్లను బుక్ చేశారు. అయితే హీరోయిన్‌పై ఫిబ్రవరి 2న కేసు నమోదు చేశారు. కేసు నమోదు కంటే ముందే టిక్కెట్లు కొనుగోలు చేసిన తీరును పరిశీలిస్తే ముందస్తు ప్రణాళిక ప్రకారమే నటిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతుందని రిమాండ్ నివేదికలో తేల్చారు. అనంతరం ముంబై వెళ్లి ఫిబ్రవరి 3న నటితో పాటు ఆమె తల్లిదండ్రులను సైతం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారన్నారు.
ఐపీఎస్ అధికారులు ప్రభావితమయ్యారు
వైసీపీనేత విద్యాసాగర్ పలుకుబడికి ఐపీఎస్ అధికారులు ప్రభావితమైనట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడు విద్యాసాగర్ నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తయారు చేశారని తెలిపారు. ఆ డాక్యుమెంట్లపై జెత్వానీ సంతకం లేదని, ఆమెకు తెలియకుండానే ఆమె బ్యాగులో డాక్యుమెంట్లను ఉంచినట్లు పేర్కొన్నారు. ముంబై నటిపై అక్రమంగా కేసు బనాయించినట్లు స్పష్టమవుతోందన్నారు. విద్యాసాగర్‌ను డెహ్రాడూన్ నుంచి రైలులో అర్ధరాత్రి తీసుకొచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించగా.. విజయవాడ సబ్‌జైలుకు తరలించారు.
దాక్కున్నా.. పట్టేశారు
నటి కాదంబరీ ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేయటంతో.. విద్యాసాగర్ తప్పించుకు తిరుగుతున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన అతడిని పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. కాగా, విద్యాసాగర్ మాత్రం కొన్నిరోజులు ముంబయిలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు.
మరి డొంక కదిలేనా..
నటి కాదంబరీ అక్రమ నిర్బంధం కేసులో ప్రధాన నిందితుడు దొరకటంతో.. సస్పెన్షన్ వేటు పడిన పోలీసు అధికారులపై కేసు నమోదు చేస్తారా? అనే అంశం ఉత్కంఠత రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉందో పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు. నేరతీవ్రత ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com