AP: తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. తిరుపతికి ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటంతో అప్పుడప్పుడూ ఎస్వీ యూనివర్సిటీలో చిరుత పులి సంచారం అంటూ వార్తలు వస్తుంటాయి. అలాగే తిరుమల ఘాట్ రోడ్లలోనూ చిరుతలు సంచరిస్తూ శ్రీవారి భక్తులకు కనిపించిన ఘటనలు కూడా అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. తాజాగా తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత భయంతో ఓ టీటీడీ ఉద్యోగి గాయపడ్డాడు. ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా ముని కుమార్ పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
వణికిపోతున్న తిరుపతి వాసులు
తిరుపతిలో చిరుత సంచారంతో తిరుపతి వాసులు, శ్రీవారి భక్తులు భయపడిపోతున్నారు. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు జంకుతున్నారు. చిరుత పులి సంచారంపై సమాచారం తెలుసుకున్న టీటీడీ అధికారులు, అటవీ సిబ్బంది స్థానికులకు అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలిపిరి సమీపంలో చిరుత సంచారం నేపథ్యంలో శ్రీవారి భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సిబ్బంది సూచించారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్తుంటారు. అయితే అలిపిరి సమీపంలోనే చిరుత కనిపించడంతో భక్తులను అప్రమత్తం చేశారు. మరోవైపు చిరుతను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతను బంధించేందుకు ట్రాప్ కెమెరాలు, బోన్ ఏర్పాటు చేయడంపై చర్చిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com