TIRUMALA: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ కథలన్నీ కల్పనలే

తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) స్పష్టం చేసింది. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్ డైమండ్‌ను మాయం చేశారంటూ 2018లో ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది. మైసూర్‌లోని ఏఎస్ఐ డైరెక్టర్(ఎపిగ్రఫీ) మునిరత్నం రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్ డైమండ్ కానేకాదని ప్రకటించారు. 1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు. మైసూరు ప్యాలెస్ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని, పింక్ డైమండ్ ప్రస్తావన అందులో లేదని మునిరత్నం రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్ డైమండ్‌ను మాయం చేశారని.. 2018లో అప్పటి ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
ఇదీ నేపథ్యం
మహారాజ పర్యటనకు సంబంధించి మైసూరు ప్యాలెస్ నుంచి 1944 డిసెంబరు 29వ తేదీన రామయ్య అనే ప్యాలెస్ అధికారి టీటీడీ కమిషనర్‌కు లేఖ రాశారు. రైలు ద్వారా 1945 జనవరి 9న ఉదయం 8 గంటలకు రేణిగుంటకు చేరుకున్న తరువాత .. మహారాజు తిరుపతి, శ్రీకాళహస్తి రాకపోకలకు రెండు మంచి కార్లను ఏర్పాటు చేసేందుకు సహకరించాలంటూ ఆ లేఖలో కోరారు. ఈ సందర్భంలోనే టూర్ షెడ్యూల్ కాపీని కూడా పంపారు.ఈ పర్యటనలోనే మైసూరు మహారాజు శ్రీవారికి హారాన్ని సమర్పించారు.ఆ హారాన్ని టీటీడీ కొన్నేళ్లుగా విశేష ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది. 2001 అక్టోబరు 21న జరిగిన గరుడసేవలో శ్రీ మలయప్పస్వామికి ఈ హారాన్ని అలంకరించారు. వాహనసేవను వీక్షిస్తున్న భక్తులు విసిరిన నాణేలు తగలడంతో ఆభరణంలో కెంపు రాయి విరిగిపోయింది. ఆ విషయాన్ని తిరువాభరణం రిజిస్టర్లో కూడా నమోదు చేశారు. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో ఉన్నది కెంపు రాయి కాదని... కోట్ల విలువైన పింక్ డైమండ్ అని... ఆ డైమండ్‌ను అపహరించి జెనీవాలో జరిగిన వేలంలో విక్రయించారని రమణ దీక్షితులు ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com