TIRUMALA: తిరుమల శ్రీవారి చెంత భక్త జన సంద్రం

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వరుస సెలవులు కారణంగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఏడు కొండులు జనసంద్రంతో నిండిపోయాయి. ఈ క్రమంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ గందరగోళం ఏర్పడింది. అలిపిరి భూదేవీ కాంప్లెక్స్‌లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దర్శన టికెట్లు తీసుకునే టైంలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఏర్పాట్లు సరిగా లేవని భక్తులు ఆరోపించారు. టికెట్ కౌంటర్లు పెంచాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న టీటీడీ సిపడా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై అధికారులు స్పందించారు. టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ... సెలవుల కారణంగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగిందన్నారు. SSD టోకెన్లు పూర్తికావడంతో దివ్యదర్శనం టోకెన్ల కోసం భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకున్నారని తెలిపారు. పరిస్థితిని వెంటనే గమనించిన విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది భక్తులను క్రమబద్ధీకరించారని వివరించారు. " దర్శన టోకెన్లు పూర్తయ్యాయని భక్తులకు స్పష్టంగా తెలియజేశాం. అక్కడ ఎలాంటి లాఠీచార్జ్ గానీ, తొక్కిసలాట గానీ జరగలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. భక్తులు సిబ్బంది సూచనలు పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని కోరుతున్నాం. వదంతులు వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. తిరుమలలో భారీగా భక్తులు ఉండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎస్పీ కీలక సూచనలు
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కూడా పలు సూచినలు చేశారు. "సెలవుల కారణంగా తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగానే కేటాయించిన 15,000 SSD టోకెన్లు పూర్తిగా పంపిణీ చేయడం జరిగింది. కోటా పూర్తి కావడంతో టోకెన్ జారీ చేసే కౌంటర్లను అధికారులు మూసివేశారు. SSD టోకెన్లు అయిపోవడంతో, దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారనే ఆశతో సుమారు 500 నుంచి 600 మంది భక్తులు అక్కడే వేచి ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారు. అక్కడ ఎలాంటి లాఠీచార్జ్ గానీ, తొక్కిసలాట గానీ జరగలేదు. దీనిపై వస్తున్న తప్పుడు వదంతులను భక్తులు నమ్మవద్దని కోరుతున్నా" అని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

