Srisailam : శ్రీశైలం శివారులో చిరుత కలకలం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శివారులో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. పాతాళగంగ మెట్లవైపు ఉన్న ఓ నివాస ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి చిరుత ప్రత్యక్షమైంది. ఓ ఇంటి ప్రాంగణంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించిన చిరుత కదలికలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పాతాళగంగ మెట్లవైపు సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డుతో కూడిన ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండటం, గతంలోనూ చిరుత సంచారం కనిపించడం వంటి కారణాలతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఆయన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా అర్ధరాత్రి సమయంలో చిరుత ఇంటి ఆవరణలోకి ప్రవేశించి కొద్దిసేపు తిరుగుతూ కనిపించింది. అనంతరం ఎటువంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
సత్యనారాయణ ఇంటికి చిరుత రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ప్రాంతం కృష్ణానది తీరానికి, అలాగే అటవీ శివారు ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో చిరుతలు, ఇతర అడవి జంతువులు తరచూ సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో జంతువుల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పాతాళగంగ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, జంతువులు నివాస ప్రాంతాల్లోకి రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరోవైపు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

