తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సంగ్రామం

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సంగ్రామం
వైసీపీ నుంచి గురుమూర్తి బరిలోకి దిగుతారా..? లేక చివరి నిమిషంలో మరో పేరు తెరమీదకు వస్తుందా అనేది చూడాల్సి ఉంది

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది.. ఏపీలో తిరుపతి పార్లమెంటు, తెలంగాణలో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.. ఈ రెండు స్థానాలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది.. ఈ రెండు స్థానాలకు ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఈనెల 30 వరకు గడువు ఉండగా.. 31న నామినేషన్లు పరిశీలిస్తారు.. ఏప్రిల్‌ 17న ఈ రెండు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతోపాటు మే 2న తిరుపతి పార్లమెంటు, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలను వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

బల్లి దుర్గా ప్రసాద్‌ మరణంతో తిరుపతి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది.. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. తిరుపతి పార్లమెంటు స్థానానికి కూడా షెడ్యూల్‌ విడుదల చేస్తుందని అంతా భావించారు. కానీ, ప్రత్యేక నోటిఫికేషన్‌ ఇస్తామని సీఈసీ చెప్పింది.. ఈరోజు షెడ్యూల్‌ అనౌన్స్‌ చేసింది. తిరుపతి ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి గురుమూర్తి బరిలోకి దిగుతారా..? లేక చివరి నిమిషంలో మరో పేరు తెరమీదకు వస్తుందా అనేది చూడాల్సి ఉంది.. అయితే, టీడీపీ కూడా అభ్యర్థి విషయంలో ఓ అడుగు ముందే ఉంది.. టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ బరిలో దిగనున్నారు. పనబాక పేరును చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.. ఇక పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతిచ్చింది.. త్వరలోనే బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనుంది ఈసీ. ఇప్పటికే జానారెడ్డిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అటు సిట్టింగ్‌ స్థానం కావడంతో ఈ ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్‌ అన్ని ప్రయత్నాలు ప్రయత్నిస్తోంది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.. టీఆర్ఎస్ నుంచి ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టికెట్ ఇవ్వాలని యాదవులు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అటు ఎంసీ కోటిరెడ్డి, గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్ లాంటి వారు కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా తమ అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. ఇటీవలే తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో రిక్కల ఇంద్రసేనారెడ్డి చేరారు. మరో బీసీ నేత కడారి అంజయ్య యాదవ్‌ కూడా బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలో టీడీపీ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story