చరిత్రలో తొలిసారి భక్తులు లేకుండా తోలేళ్ల ఉత్సవం

ఉత్తరాంద్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతర ఎలాంటి హంగామా లేకుండానే జరుగుతోంది. కరోనా ప్రభావంతో చరిత్రలో తొలిసారి భక్తులు లేకుండా తోలేళ్ల ఉత్సవం నిర్వహించారు. తోలేళ్ల ఉత్సవానికి ఆన్‌లైన్ దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవం కళ తప్పింది. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర ఈసారి చాలా సాధారణంగా జరుగుతోంది.
మరోవైపు పైడితల్లి అమ్మవారి దర్శనానికి అశోక్‌గజపతిరాజు కుటుంబం దూరమయ్యింది. ఏటా తోలేళ్లు, సిరిమాను ఉత్సవం రెండురోజుల్లో.. అశోక్‌గజపతిరాజు కుటుంబం అమ్మవారి దర్శనం చేసుకునేది. ఈసారి తోలేళ్ల ఉత్సవం ఒక్కరోజే దర్శనానికి అనుమతివ్వడం.. ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు అవమానంగా భావించి ఉత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పట్ల అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి.
అమ్మవారి జాతరలో భాగంగా మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా మాన్సాస్ ట్రస్టు తరపున ఆ సంస్థ చైర్మన్ అమ్మవారిని దర్శంచుకొని పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో మేళతాళాలు, పల్లకిలో పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న సంచయితకు దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు సంచయిత. అమ్మవారి చల్లని చూపులు, కరుణకటాక్షాలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
జాతరలో చివరిగా పైడితల్లి అమ్మవారి దేవస్దానంలో జరిగే ప్రధాన పండగ సిరిమాను ఉత్సవాన్ని కూడా ఎలాంటి హంగామా లేకుండా నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా సిరిమానోత్సవం రోజున జరిగే కార్యక్రమాలకు భక్తులను అనుమతించడం లేదు. ఆలయ పూజారులు, అధికారులు, అమ్మవారి మాలాధారణ చేసినవారు, పోలీసులు సమక్షంలో సిరిమానోత్సవాన్ని నిర్వహించనున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com