Maadhavi Latha: బోరున ఏడుస్తూ వీడియో షేర్ చ్సిన మాధవీలత

Maadhavi Latha:  బోరున ఏడుస్తూ వీడియో షేర్ చ్సిన మాధవీలత
X
తన ఆత్మగౌరవం మీద దాడి జరుగుతోందంటూ ఆవేదన

టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత బోరున విలపిస్తూ ఓ వీడియోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇక ఆ వీడియోకి సుదీర్ఘ నోట్ రాసి తన మనసులోని ఆవేదనను బయట పెట్టింది. ఆ నోట్ లో "ఎమోషనల్ అవ్వకుండా ఉండడానికి చాలా ప్రయత్నించాను. కానీ నేను కూడా మనిషినే కదా? నా ఆత్మగౌరవం మీద జరిగిన దాడి వల్ల కలిగిన బాధను వర్ణించడానికి పదాలు లేవు. ప్రతిక్షణం వేదన, దుఃఖం, నిరాశ, కోపం... అన్నీ నన్ను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ఎన్నోసార్లు ఎంతమందో ప్రయత్నించారు. పదేపదే ఇలాంటి మాటలు అన్నారు. నా పార్టీ కోసం, హిందూ ధర్మం కోసం, మహిళల కోసం... నిస్వార్ధంగా నా వంతుగా నేను పోరాడుతున్నాను. ఎవరికి ద్రోహం, మోసం చేసింది లేదు. నాకు సపోర్ట్ గా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎంతోమంది శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమిస్తారని ఆశిస్తున్నాను" అంటూ మాధవీలత కంటతడి పెట్టుకున్న వీడియోని షేర్ చేసింది.

అసలు ఏమైందంటే...

మాధవీలత సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. బీజేపీ నాయకురాలైన ఆమె తరచుగా వివాదాస్పద అంశాలతో వార్తలో నిలుస్తూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, సమాజంలో జరిగే ఇతర విషయాలపై కూడా రెస్పాండ్ అవుతూ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొడుతుంది. అయితే రెండ్రోజుల క్రితం ఆమె జేసి ప్రభాకర్ రెడ్డిపై చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన కూడా మాధవీలతపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో, ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. చివరికి ఆయన తప్పయింది అంటూ సారీ చెప్పినప్పటికీ, ఈ వివాదం శాంతించినట్టుగా కనిపించట్లేదు. తాజాగా మాధవీలత షేర్ చేసిన మరో వీడియో వైరల్ అవుతుంది.

మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు

సినీ నటి మాధవీలతపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆవేశంతో మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశానని.. దీనిపై ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Tags

Next Story