TOMATO FARMERS: తల్లడిల్లుతున్న టమాట రైతు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. ముఖ్యంగా టమాటా సాగు చేసిన కర్షకుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రారంభంలో మార్కెట్లో మంచి ధరలు కనిపించడంతో అధిక లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు, ఇప్పుడు ధరలు కుప్పకూలడంతో పెట్టుబడే తిరిగి రాని పరిస్థితి నెలకొంది. దీంతో అప్పులు, ఖర్చుల భారం మధ్య రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రుసుంపల్లి, సల్కర్పేట్, రంగారెడ్డిపల్లి, వెన్నచేడ్, కొంరెడ్డిపల్లి, గండీడ్ గ్రామాల్లో పలువురు రైతులు టమాటా పంటను విస్తృతంగా సాగు చేశారు. మొదట్లో కిలోకు రూ.30 నుంచి రూ.60 వరకు ధర పలకడంతో ఆశాజనక పరిస్థితి కనిపించింది. కానీ పంట చేతికొచ్చే సరికి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 25 కిలోల టమాటా బాక్సు రూ.100 కూడా పలకకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. కొన్ని చోట్ల 28 కేజీల కేటును వ్యాపారులు కేవలం రూ.120 నుంచి రూ.150కే కొనుగోలు చేస్తున్నారు.
ఒక ఎకరంలో టమాటా సాగు చేయడానికి రైతులు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దుక్కి దున్నడం, పొలాన్ని చదును చేయడం, నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేయడం, ఎరువులు, పురుగుమందులు, కలుపు తీయడం, కూలీల ఖర్చులు అన్నీ కలిపి వ్యయం అధికంగా ఉంటుంది. టమాటా కిలో రూ.30 నుంచి రూ.50 వరకైనా అమ్మగలిగితే పెట్టుబడి పోను కొంత లాభం వచ్చేదని రైతులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత ధరలు ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులు కూడా రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో టమాటా ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాలూరు మండలంలో సుమారు 300 ఎకరాల్లో టమాటా పంట సాగు అవుతోంది. దిగుబడి బాగా వచ్చినప్పటికీ సరైన ధర లేకపోవడం అన్నదాతలను నష్టాల్లోకి నెట్టేస్తోంది. కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా చెల్లించలేని స్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
