Maredumilli: మారేడుమిల్లి టూర్‌లో విషాదం.. ఇద్దరు వైద్యవిద్యార్థుల మృతదేహాలు లభ్యం

Maredumilli: మారేడుమిల్లి టూర్‌లో విషాదం.. ఇద్దరు వైద్యవిద్యార్థుల మృతదేహాలు లభ్యం
X
అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లినవారిలో ఇద్దరు మృతిచెందారు. ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు కాగా.. సోమవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పార్వతీపురం జిల్లా బొబ్బిలికి చెందిన కొసిరెడ్డి సౌమ్య (21), బాపట్లకు చెందిన బి.అమృత (21) మృతదేహాలను గుర్తించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మరో యువకుడు సీహెచ్‌ హరదీప్‌ (20) కోసం గాలింపు కొనసాగుతోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

స్నేహితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ట్రావెలర్‌ వాహనంలో ఆదివారం వచ్చారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో అయిదుగురు కొట్టుకుపోయారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్‌, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్‌ కోసం గాలింపు కొనసాగుతోంది.

Tags

Next Story