
పల్నాడు జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు కొండలు కరిగిపోతున్నాయి. అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తూ....అధికారపార్టీ నేతలు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో పల్నాడు జిల్లా త్రిపురాపురం కొండ గుండుకొట్టిన చందంగా మారింది. గతంలో పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే కొండ నేడు బోసిపోయింది. ఇదేవిధంగా అక్రమరవాణా కొనసాగితే కొండ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది.
నకరికల్లు మండలంలోని త్రిపురాపురం పరిధిలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి సమీపంలో త్రిపురాపురం కొండ ఉంది. ఇక్కడ నాణ్యమైన ఎర్రగ్రావెల్ లభిస్తోంది. మొదట అనుమతులు తీసుకుని కొండ కిందిభాగంలో కొంత విస్తీర్ణంలో తవ్వకాలు చేశారు. అనంతరం అనుమతులే లేకుండా అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. భారీ పొక్లయిన్లు పెట్టి టిప్పర్లతో నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారు. మట్టి మాఫియా వెనుక వైకాపా ముఖ్యనేత అండ ఉండటంతో యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.
తవ్వకాల వల్ల భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రైవేటు సంస్థ రాయల్టీ వసూలుచేస్తోంది. ఈక్రమంలో ప్రైవేటు సంస్థ తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి లారీకి సొమ్ము వసూలు చేస్తోంది. మూడేళ్ల కిందటి కొండ చిత్రాన్ని తాజా చిత్రాన్ని పోల్చి చూస్తే కొండను ఎలా కొల్లగొట్టారో స్పష్టమవుతుంది. అడ్డఅదువులేని తవ్వకాలతో కొండ కరిగిపోతోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com