TS ASSEMBLY: జగన్ మెడపై అనర్హత కత్తి.!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ఆటోమేటిక్‌గా డిస్ క్వాలిఫై అయిపోతారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చంటి పిల్లొడిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చందమామా కోసం మారాం చేసినట్లుగా దక్కని ప్రతిపక్ష హోదా కోసం మారాం చేయడం ఏమిటంటూ సెటైర్లు వేశారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ రాకపోతే పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు రావడం ఖాయం అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందుల మరోసారి చర్చలోకి వచ్చింది. ఇటీవల అక్కడ జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అంచనాలు తారుమారయ్యాయి. ఎన్నాళ్లుగా తమ గడపలో ఓటమి అనే మాట విననని వైసీపీ, ఈసారి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తింది. దీంతోనే ఇప్పుడు అక్కడి అసెంబ్లీ సీటు భవిష్యత్తు గురించే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల సీటు కూడా ప్రమాదంలో పడుతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
11 స్థానాలకు ఉప ఎన్నికలంటూ కామెంట్స్
ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయినా సరే శాసన సభాసమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగానే భావించాల్సి వస్తోంది అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. వయసులో పెద్దవాడిగా, శాసనసభా ఉపసభాపతిగా వైఎస్ జగన్‌ను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తాను ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ సిద్ధమా అని...సిద్ధం అయితే తన సవాల్‌ను వైఎస్ జగన్ స్వీకరించాలని కోరారు. ఒకవేళ రాని పక్షంలో వైసీపీ గెలిచిన 11 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారపక్షం దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. సభకు రాకుండా ప్రశ్నలు అడిగే వారిని అనుమతించేది లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
ఆ నిర్ణయంతో రాజకీయ నష్టం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇలానే అసెంబ్లీ బహిష్కరణ కొనసాగిస్తే మెుదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా దేవుడెరుగు తన శాసనసభ సభ్యత్వానికే దూరం కావాల్సి వస్తుంది. ఇది కేవలం ప్రతిపక్ష హోదా కోల్పోవడం కన్నా చాలా పెద్ద రాజకీయ నష్టం. పులివెందుల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచినట్టు అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు శాశ్వతం. పంతం కోసం పదవిని పణంగా పెట్టడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశం అవుతుంది. పంతం కన్నా పదవిని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ఆయన మొగ్గు చూపే అవకాశం వుంది. ఆయన అసెంబ్లీకి తిరిగి రావడం అనివార్యంగా తెలుస్తోంది. వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుకావడానికి ఒక లిమిట్ ఉంది అని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంటుందని ఆ పరిధి దాటితే వేటేనని అంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశ దినాలు గైర్హాజరైతే, ఆ సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం శాసనసభకు ఉంటుంది.
వైపీపీ మొగ్గు గైర్హాజరు వైపే
వైసీపీ మాత్రం గైర్హాజరు కొనసాగించాలని భావిస్తోందన్న ప్రచారం ఉంది. అలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు. 11 స్థానాలు ఖాళీ అయితే ఉప ఎన్నికలు జరిగి, అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ గట్టి కసరత్తు చేస్తే గెలుపు సాధ్యమని రాజకీయ వర్గాల అభిప్రాయం. పైగా ఎప్పటినుంచో కూటమి నేతల దృష్టి పులివెందులపైనే ఉంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ ఇక పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. జగన్ ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఎప్పుడూ ఓటమి చూడలేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తోంది. ప్రజల్లోనూ మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com