TTD : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు టికెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టికెట్లను తిరిగి ప్రారంభించింది. మూడేళ్ల తర్వాత టీటీడీ దివ్యదర్శనం టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేసింది. కరోనా సమయంలో నిలిచిపోయిన ఈ విధానం.. తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి మెట్టు నుంచి వచ్చే వారికి పదివేలు, అలిపిరి నుంచి వచ్చే భక్తులకు 15 వేల టోకెన్లను జారీ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కాలినడకన వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు.. సర్వ, ప్రత్యేక ప్రవేశ దర్శనాల భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా టోకెన్లు జారీ చేస్తోంది. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం.. సర్వదర్శన తరహాలోనే గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సిన పరిస్థితి రావడంతో 2017లో టీటీడీ ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
కాలినడకన వచ్చే భక్తులకు ప్రారంభ దశలో రోజుకు 20 వేల మందికి టోకెన్లు పంపిణీ చేసిన తితిదే క్రమంగా 25 వేల టోకెన్ల జారీ చేపట్టింది. అయితే కరోనా మహమ్మారితో 2020 మార్చి 19 నుంచి దర్శన విధానాల్లో మార్పు చేసింది టీటీడీ. దివ్యదర్శన టోకెన్ల జారీ పూర్తిగా నిలిపివేసింది. కరోనా నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనడం.. దర్శన విధానాలు అన్ని పునరుద్ధరణ చేయడంతో దివ్యదర్శన టోకెన్లను తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. నెల రోజుల పాటు పరిశీలించిన అనంతరం టోకెన్ల సంఖ్య పెంచే అంశంపై నిర్ణయం తీసుకొంటామని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com