TTD: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలెర్ట్

తిరుమలలో సోమవారం అర్దరాత్రి దాటిన తర్వాత శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంతో పాటు సప్తగిరులను టీటీడీ సుందరంగా అలంకరించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్దరాత్రి 1.30 గంటలకు వైకుంఠద్వారాలు తెరచుకోనున్నాయి. మొదట వీఐపీలు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని కల్పించనున్నారు.
అర్ధరాత్రి తర్వాత....
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వంసిద్ధమైంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లూ ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులను తెరవనున్నారు. వైకుంఠద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించనున్నారు. తోమాలపటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టుకు పుష్ప సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు ఏకాంత సేవలు నిర్వహిస్తారు.1. 30గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దీంతో వైకుంఠ ఏకాదశి స్వామి వారి దర్శనాలు ప్రారంభవుతాయి.. జనవరి 8వరకు ఈ దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా టీటీడీ ఏర్పాటు చేసింది. ఏదైనా ఇబ్బంది కలిగినా లేదా సమాచారం కావాలన్నా సంప్రదించవలసిన ముఖ్యమైన అత్యవసర ఫోన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ నెంబర్లను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని భక్తులకు సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

