TTD: హెరిటేజ్ సంస్థపై ఆరోపణలను ఖండించిన టీటీడీ ఛైర్మన్

TTD: హెరిటేజ్ సంస్థపై ఆరోపణలను ఖండించిన టీటీడీ ఛైర్మన్
X
ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ హెరిటేజ్ పాత్ర లేదన్న బీఆర్ నాయుడు

కల్తీ నెయ్యి కేసు నేపథ్యంలో వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు చేయడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తీవ్రంగా ఖండించారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, హెరిటేజ్ సంస్థకు నెయ్యి సరఫరాలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిపారు. ఆ సంస్థ ఎప్పుడూ తితిదేకు నెయ్యి అందించలేదని, ఇది నిర్ధారితమైన నిజమని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ హెరిటేజ్ పాత్ర లేదని ఆయన నొక్కి చెప్పారు. అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తే అవి నిజమవుతాయని భావించడం తప్పు అని బీఆర్‌ నాయుడు విమర్శించారు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్‌ను చూపిస్తూ దానిని నెయ్యి అని చెప్పడం ద్వారా వైసీపీ నేతలు తమ పరువును తాము దెబ్బతీసుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్ సూచనల ప్రకారం కాకుండా, విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

నెయ్యి ధరల విషయంలోనూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓపెన్ టెండర్ల ద్వారా పారదర్శకంగా ధరలను నిర్ణయించామని చెప్పారు. తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన వెంటనే స్వామివారి అన్నప్రసాదాల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని నిర్ణయించుకున్నామని తెలిపారు. తక్కువ ధరలకు సరుకులు కొనుగోలు చేసి నాణ్యత లేని నైవేద్యాలు, అన్నప్రసాదాలు అందించడం అనేది అనుచితమని స్పష్టం చేశారు. నెయ్యి మాత్రమే కాకుండా అన్ని పదార్థాలలోనూ నాణ్యతా ప్రమాణాలు పెంచామని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు. స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో ఖర్చు ఎంత అవుతుందనే లెక్కలు వేయబోమని, అది దేవదేవుని సొమ్మని చెప్పారు. భక్తులకు అందించే ప్రసాదాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టంచేశారు.

Tags

Next Story