TTD: పవన్ కల్యాణ్ సూచనలు పాటిస్తాం
తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని విషయాలను అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని ఆయన తెలిపారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎంతో బాధపడ్డారని బీఆర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామని, నేడు వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తామని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించారు.
అధికారుల తప్పిదం వల్లే...
తిరుపతి తొక్కిసలాట ఘటన కొంతమంది అధికారుల తప్పిదం వల్లే జరిగిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేంకటేశ్వరస్వామికి సీఎం చంద్రబాబు ప్రథమ భక్తుడని.. తాను ఎవరితోనైనా పెట్టుకుంటానని, కానీ స్వామివారితో పెట్టుకోనని ఆయన చాలాసార్లు చెప్పారని టీటీడీ ఛైర్మ న్ గుర్తు చేశారు. తోపులాట ఘటనపై ముఖ్యమంత్రి చాలా బాధపడ్డారని... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలను కచ్చితంగా పాటిస్తామన్నారు. బోర్డు తప్పిదం లేకపోయినా.. పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నామని వెల్లడించారు. ఇకపై జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాలకమండలి భాగస్వామ్యం అవుతుందన్నారు. కొందరు అధికారుల అత్యుత్సాహం వల్ల జరిగిన ఘటన ఇదని... అధికారులూ క్షమాపణ చెప్పాలని.. వాళ్లు చెప్పకపోతే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు
మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. ఘటనపై ఇప్పటికే న్యాయవిచారణకు సీఎం ఆదేశించారని తెలిపారు. తప్పిదం ఎలా జరిగిందనే దానిపై న్యాయ విచారణ త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూస్తామని టీటీడీ ఛైర్మన్ అన్నారు. చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని అవి మా దృష్టికి వచ్చాయని, ఘటనకు సంబంధించి ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com