TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు కన్నుమూత.. వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే విషాదం

TTD EO Dharma Reddy: మరో నెల రోజుల్లో ఆ ఇల్లు పెళ్లి సందడితో కళకళలాడాల్సి ఉంది. అంతలోనే విధికి కన్నుకుట్టింది. సంతోషంతో తన పెళ్లి శుభలేఖలు పంచడానికి వెళుతున్న అతడికి గుండెనొప్పి రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. టీటీడీ ఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అకస్మాత్తుగా ఇలా గుండెపోటుకు గురై మరణించడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన అతడిని చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అతడు తుది శ్వాస విడిచాడు. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. తండ్రి ధర్మారెడ్డిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు పరామర్శించారు.
చంద్రమౌళికి టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. జనవరిలో వీరి వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ క్రమంలో చంద్రమౌళి వివాహ శుభలేఖలు పంచడానికి స్నేహితుడితో కలిసి కారులో వెళుతున్నారు. మార్గమధ్యంలో చంద్రమౌళి గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితుడు వెంటనే అతడిని దగ్గరలో ఉన్న కావేరీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ డాక్టర్లు అత్యవసరంగా వైద్యం అందించారు. అయినా అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కావేరీ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అతడికి కార్డియో పల్మనరీ రిసపిటేషన్ (సీపీఆర్) ప్రారంభించి, ఎక్మో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయినా అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తూ, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com