TTD: శ్రీవారి భక్తులకు కీలక అలెర్ట్

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్టుమెంట్లన్ని భక్తులతో నిండిపోయాయి. టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 6 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారని టీటీడీ వెల్లడించింది. శనివారం 75,428 మంది స్వామివారిని దర్శించుకోగా... 36,240 మంది భక్తులు తలనీలాలు, మక్రింటుతున్నారు. హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు వచ్చింది.
చంద్రగ్రహణం వేళ
ఈ నెల 3వ తేదీన ఏర్పడనున్న చంద్రగ్రహణం దృష్ట్యా 2, 3 తేదీలకు సంబంధించిన శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే 1, 2 తేదీల్లో తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ఉండదని స్పష్టం చేసింది. 3వ తేదీన మాత్రం 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభిస్తారు. అదేవిధంగా 3వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసిన నేపథ్యంలో, 2వ తేదీన వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు తెలిపారు.
శ్రీవారి ముడుపు పత్రం పథకం ఆరంభం
భక్తుల సౌకర్యార్థం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘శ్రీవారి ముడుపు పత్రం పథకం’ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఇప్పటివరకు భక్తులు నేరుగా హుండీలో నగదు, నాణేలు సమర్పించేవారు. ఇకపై తిరుమలలో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్ల వద్ద UPI ద్వారా చెల్లింపులు చేసి, అందుకు సంబంధించిన ముడుపు పత్రాలను తీసుకుని వాటిని హుండీలో వేయవచ్చు. దీంతో నగదు తీసుకువచ్చే ఇబ్బందులు తొలగుతాయని అధికారులు భావిస్తున్నారు. అదనంగా భక్తులకు అన్నప్రసాదం అందించే సదుపాయాలను విస్తరించేందుకు ఆధునిక సాంకేతికతతో కొత్త అన్నప్రసాద భవనం, వంటశాల నిర్మాణానికి రిలయన్స్ సంస్థ రూ.100 నుండి రూ.120 కోట్ల విరాళం అందించేందుకు ముందుకు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ పనులకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
