శ్రీవారి సన్నిధిలో 'సంప్రదాయ' భోజనం.. గో ఆధారిత ఉత్పత్తులతో తయారీ..

శ్రీవారి సన్నిధిలో సంప్రదాయ భోజనం.. గో ఆధారిత ఉత్పత్తులతో తయారీ..
మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందని ఇకపై ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. శ్రీవారి భక్తుల కోసం సంప్రదాయ భోజనం సిద్ధమవుతోంది.

ఏడుకొండలవాడిని దర్శంచుకునేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు తరలి వస్తుంటారు. స్వామి వారి దర్శనం పూర్తయ్యాక ఆత్మారాముడిని చల్లబరచాలంటే కడుపులో నాలుగు మెతుకులు పడాలి. మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందని ఇకపై ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. శ్రీవారి భక్తుల కోసం సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది టీటీడీ.

సేంద్రియ ఎరువులు, గో ఆధారిత ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేసి భక్తులకు అందించనున్నారు. ఇప్పటికే శ్రీవారికి నైవేద్యం ఇదే పద్దతిలో తయారు చేసి స్వామి వారికి సమర్పిస్తున్నారు. ఇకపై భక్తులకు కూడా ఇదే పద్దతిలో సంప్రదాయ భోజనాన్ని అందించాలని అధికారులు నిర్ణయించారు.

అన్నమయ్య క్యాంటీన్‌లో సంప్రదాయ భోజనం కింద అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం తయారు చేస్తారు. "మేము సేంద్రీయ ఆహార పదార్థాల ధరలను ప్రస్తుత ధరల ఆధారంగా నిర్ణయించాలనుకుంటున్నాము" అని టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి అన్నారు.

చిరు ధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ, 'మిల్లెట్ రాంబాబు' గా ప్రసిద్ధి చెందిన ఆహార నిపుణుడు రాంబాబు మాట్లాడుతూ, "సేంద్రీయ ఆహారం చాలా ఆరోగ్యకరమైనది కనుక టిటిడి యొక్క సంప్రదాయ భోజనం ప్రాజెక్ట్ ఖచ్చితంగా యాత్రికులలో పెద్ద విజయం సాధిస్తుంది." దీనిని 'అమృత భోజనం' అని పేర్కొన్నారు.

దేశీ ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలను విస్మరిస్తూ పాశ్చాత్య ఆహారాన్ని అలవాటు చేసుకుంటున్నాము. ఇప్పుడు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాత రోజులు తిరిగి వచ్చాయి. ఇది ఆరోగ్యకరమైన జీవన విధానానికి నాంది అని ఆయన నొక్కిచెప్పారు.

అన్నం, పులిహోరా, పూర్ణాలు, వడ, పప్పు, సాంబారు, రసం.. ఇలా మొత్తం 14 రకాల ఆహార పదార్థాలతో సంప్రదాయ భోజనం రెడీ అవుతోంది. తొలి రోజు కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేసి టీటీడి అధికారులకు అందించారు. దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో వీటిని తయారు చేస్తున్నారు. వీటిలో వ్యాధినిరోధకతను పెంపొందించే సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ సంప్రదాయ భోజనాన్ని భక్తులకు అందించి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఏయే ప్రదేశాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలి, భోజనం ఎంతకు విక్రయించాలనే విషయాలపై టీటీడి కసరత్తు చేస్తోంది. మరో 15, 20 రోజుల్లో ఈ భోజనం భక్తులకు అందుబాటులోకి వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story