ttd: 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం: టీటీడీ

కృత్రిమ మేధ ద్వారా భక్తులకు 1-2 గంటల్లోనే శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీలో పనిచేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేసేందుకు, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్యమత ప్రచారంలో పాల్గొంటే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీవాణి దర్శన సమయాల వేళలు మారుస్తామని వెల్లడించారు. "ఉదయం టికెట్లు తీసుకుని సాయంత్రం దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీవారి దర్శనాలు, ప్రసాదాల విషయంలో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఏడాది కాలంలో 30వేల నకిలీ వెబ్సైట్లను క్రాష్ చేశాం. భద్రతా చర్యల్లో భాగంగా అలిపిరిలో స్కానర్లు అప్డేట్ చేస్తున్నాం." అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com