TTD: ముగిసిన బ్రహ్మండనాయకుడి బ్రహ్మోత్సవాలు

బ్రహ్మండనాయకుడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత నెల 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగా 24న బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరిగింది అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.గత నెల 24 రాత్రి పెద్దశేష వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి వాహన సేవలు బుధవారం రాత్రి జరిగిన అశ్వ వాహన సేవతో వాహన సేవలు ముగిసాయి.
చివరి రోజు వైభవంగా చక్నస్నానం
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల చివరి రోజు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటలకు వేడుకగా పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. తర్వాత శ్రీవారి పుష్కరిణి లో శాస్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. చక్రత్తాళ్వార్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి చక్రస్నానం నిర్వహించగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానంకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేపట్టారు. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో ఉండటానికి స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం రూ. 25.12 కోట్లు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16 వాహన సేవలు, మూలమూర్తి దర్శనం నిర్వహించినట్లు తెలిపారు. గరుడసేవ రోజున అదనంగా 45,000 మందికి దర్శనం కల్పించినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ఇప్పటివరకు 5.80 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా.. స్వామివారి హుండీకి రూ.25.12 కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపారు. మొత్తంగా 26 లక్షల మందికి అన్నప్రసాదం పంపిణీ చేయగా.. 28లక్షలకు పైగా లడ్డూల విక్రయం జరిగినట్లు తితిదే ఛైర్మన్ వెల్లడించారు. 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారన్నారు. 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలు , గరుడసేవ రోజు 20 రాష్ట్రాల నుంచి 37 బృందాలు (780 కళాకారులు) సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com