19 Nov 2020 6:57 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తుంగభద్ర పుష్కరాలు.....

తుంగభద్ర పుష్కరాలు.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదం!

తుంగభద్ర పుష్కరాలు.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదం!
X

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తుంగభద్ర పుష్కరాల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదస్పదామవుతున్నాయి. సీఎం జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కరోనాను సాకుగా చూపించి 12 సంవత్సరాలకు ఓసారి వచ్చే అతి పెద్ద పుష్కర పండుగను భక్తులకి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పద్ధతి మార్చుకోకపోతే ఛలో తుంగభద్రకి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నాయి.

2008లో తుంగభద్ర పుష్కరాలు వచ్చాయి. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పుష్కర గడియలు వచ్చాయి. ఎగువన కర్ణాటక దిగువన ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు , పొరుగున తెలంగాణ రాష్ర్టలను కలుపుతూ తుంగభద్రమ్మ సప్తనధుల సంగమేశ్వరం వద్ద కలిసి శ్రీశైలంలో కలుస్తుంది. అంటే కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర మెలిగినూర్ నుంచి సంగమేశ్వరం వరకు 127 కిలోమీటర్లు తుంగభద్ర ప్రయాణం చేస్తుంది.

పుష్కరాలు అంటే హిందువులకి ఎంతో ముఖ్యమైనవి. ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ సమయంలో ఆ ఘడియల్లో సాక్షాత్తు దేవతలు అక్కడ కొలువై ఉంటారనేది భక్తుల నమ్మకం. తరతరాలుగా వస్తున్న పురాతన ఆచారం. అందుకే దేశంలో ఏ పుణ్య నదికి పుష్కరాలు వచ్చినా భక్తులు లక్షల సంఖ్యలో అక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేస్తారు. పెద్దల ఆత్మలకు శాంతి కలగాలని పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా, గోదావరి పుష్కరాలు ఘనంగా జరిగాయి.

ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండడం.. కరోనా ఉన్న సమయంలో తుంగభద్ర పుష్కరాలు వచ్చాయి. అయితే కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఈ పుష్కరాలకు కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. 2008లో జరిగిన తుంగభద్ర పుష్కరాలకు 85 లక్షల మంది తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు.

అయితే ప్రభుత్వం మాత్రం కరోనా నేపథ్యంలో పవిత్ర తుంగభద్ర నదిలో ఎవరూ పుణ్య స్నానాలు చేయకూడదని నిషేధం విధించింది. అంతేకాకుండా పుష్కరాల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో ఉచిత ఈ-పాస్ తీసుకోవాలని ఆంక్షలు పెట్టింది. అది కూడా కేటాయించిన టైం స్లాట్ ప్రకారం పుష్కరాలకు రావాలంటోంది. పిల్లలు, వృద్ధులు,కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి అనుమతి లేదని చెబుతోంది. వచ్చిన వారు నెత్తిన నీళ్లు చల్లుకుని పుష్కర ఘాట్ల వద్ద పూజలు, లేదా పిండ ప్రధానాలు మాత్రం చేసుకుని వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.

పుష్కరాలు అంటేనే నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం.. అలాంటిది పుణ్య స్నానాలనే నిషేధించడం ఏమిటని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ పుష్కరాలు నిర్వహించాలి కానీ ఇలా స్నానాలు నిషేధించటం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పుణ్యస్నానాలకు అనుమతి లేనప్పుడు పూర్తిగా రద్దు చేయాలి కానీ.. నిధులు ఇచ్చి ఆర్భాటాలు చేయాల్సిన పనేముందని ప్రశ్నిస్తున్నాయి.

ఇక పుష్కరాలకు 230కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో అధికార పార్టీ నేతలు పండుగ చేసుకుంటున్నారు. పుష్కరాల పుణ్యమా అని కోట్లాది రూపాయల నిధుల పనులు దక్కాయని కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారు. ఉన్న రోడ్ల మీదనే కొత్త రోడ్లు వేస్తూ, ప్రధాన కూడళ్లలో రంగులు అద్దుతూ.. పాత పుష్కర ఘాట్లకే పై పై మెరుగులు దిద్దుతూ అందిన కాడికీ ఊడ్చేస్తున్నారు.

పుష్కరాల్లో పుణ్యస్నానాలకు ప్రభుత్వం అనుమతించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వీహెచ్ పీ నాయకులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతలు గుంపులుగా సమావేశాలు, పాదయాత్రలు చేస్తే రాని కరోనా.. పవిత్ర పుణ్యస్నానం చేస్తే వస్తుందా అని నిలదీస్తున్నారు. పుణ్యస్నానానికి అనుమతి ఇవ్వకపోతే ఛలో తుంగభద్రకు పిలుపునిస్తామని హెచ్చరిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ కు లేఖలు రాశారు.

Next Story