ఏపీలో అల్లాడుతున్న పసుపు రైతులు

ఏపీలో అల్లాడుతున్న పసుపు రైతులు
X
మూడు నెలలుగా కొనేవారు రాక.. పంటకు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

ఏపీలో పసుపు రైతులు అల్లాడుతున్నారు. మూడు నెలలుగా కొనేవారు రాక.. పంటకు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ ముగిసి ఖరీఫ్‌ మొదలవుతున్నా ప్రభుత్వం సేకరణ ప్రారంభించలేదని వాపోతున్నారు. ప్రతీ ఏడాది పంట వేయడానికి ముందే మద్దతు ధరలు ప్రకటిస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌,.. నాలుగేళ్లుగా పసుపు పంటకు మద్దతు ధర విషయాన్ని మర్చిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది క్వింటాల్‌ పసుపు ధర 6వేలు కాగా.. ప్రస్తుతం ఏపీలో క్వింటాలు పసుపు ధర 5వేలు పలుకుతోంది. అయితే ధర పడిపోయినా కొనేవారు ముందుకు రావడం లేదు. దీంతో నాలుగేళ్ల క్రితం ప్రకటించిన ధర 6వేల 850 రూపాయలకైనా కొనాలని ప్రభుత్వాన్ని పసుపు రైతులు వేడుకుంటున్నారు. అయినా ముఖ్యమంత్రి మనసు కరగడం లేదంటున్నారు. గతేడాది కూడా ఇలాగే పంట కాలం పూర్తయ్యాక జూన్‌లో కొనుగోలు ప్రారంభించి.. మొక్కుబడిగా 6వేల టన్నులు సేకరించి ముగించారని చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఉలుకు పలుకు లేకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.

రైతులకు మార్చిలో పంట చేతికొచ్చింది. ఇప్పుడు జూన్‌ నెల ప్రారంభమైనా సేకరణకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. అంటే దాదాపు 3నెలలుగా రైతులు అమ్మకానికి ఎదురుచూస్తున్నారు. ఈలోగా అకాల వర్షాలు కురవడంతో అక్కడక్కడ పసుపు తడిసింది. అయినా కనీసం పంట నష్టపోయిన రైతులకు పరామర్శలూ లేవు. ఎకరానికి లక్షా 50వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు.. పంట అమ్మితే సగ‌ం కడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.

Tags

Next Story