గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్టులు!

గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్టులు!
గాయత్రి ఆత్మహత్యకు ముందు నీలిమ అనే యువతి గాయత్రి ఇంటికొచ్చారు. నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి ఇంట్లో చీరతో ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది.

విజయవాడ వాంబే కాలనీలో ఈవెంట్‌ డ్యాన్సర్‌ గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే ఆమె మరణానికి వివాహేతర సంబంధాలు కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసును పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గాయత్రిని కలిసిన నీలిమ విచారణలో పలు విషయాలు వెల్లడించారు.

గాయత్రి ఆత్మహత్యకు ముందు నీలిమ అనే యువతి గాయత్రి ఇంటికొచ్చారు. నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి ఇంట్లో చీరతో ఉరివేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో పిల్లలతో కలిసి గాయత్రి భర్త సతీశ్‌ బయటకు వెళ్లారు. అయితే నీలిమ, గాయత్రి మధ్య గొడవ జరిగినట్టు గాయత్రి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయత్రి ఇంటికి వచ్చి వెళ్లిన నీలిమను పోలీసులు ప్రశ్నించారు. గాయత్రి ఇంటికి తాను వెళ్లిన మాట వాస్తవమేనని ఆమెతో ఘర్షణ పడలేదని నీలిమ తెలిపారు. గాయత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పోలీసులే తేల్చాలని విచారణలో నీలిమ స్పష్టంచేశారు.

పోలీసుల విచారణలో నీలిమ మరిన్ని వివరాలు వెల్లడించారు. గాయత్రికి కొంతకాలం క్రితం వరకు తన భర్త బన్నీతో వివాహేతర సంబంధం ఉండేదని తెలిపారు. ఆరు నెలల క్రితమే గాయత్రిని కలిసి తన భర్త బన్నీకి దూరంగా ఉండాలని చెప్పగా ఆమె అంగీకరించిట్టు చెప్పారు. ఇద్దరం స్నేహితులుగా ఉందామని అనుకున్నామని పోలీసులకు నీలిమ తెలిపారు. అయితే గాయత్రికి, తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్న విషయం గాయత్రి భర్త సతీశ్‌కు తెలిసిందని పోలీసు విచారణలో నీలిమ చెప్పారు. వివాహేతర సంబంధం గురించి తెలిశాక గాయత్రిని భర్త సతీశ్‌ తీవ్రంగా కొట్టినట్టు నీలిమ వెల్లడించారు. ఈ విషయం గాయత్రి తనకు ఫోన్‌లో చెప్పినట్టు తెలిపారు. గాయత్రి భర్తపై నీలిమ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అటు తమ కుమార్తె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావడంలేదని గాయత్రి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గాయత్రి చావుకు తమ అల్లుడు కారణం కాదని నీలిమ, ఆమె భర్త బన్నీ ప్రమేయంపై విచారణ చేయాలని కోరారు. తమ మనవళ్లు వచ్చి చెప్పేంత వరకు గాయత్రి ఆత్మహత్య విషయం తెలియదని అన్నారు. పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని గాయత్రి తండ్రి డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story