AP: లద్ధాఖ్ మృతుల్లో ఇద్దరు ఏపీ సైనికులు

లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు లేహ్‌కు 148 కి.మీ. దూరంలో మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయింది. దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు కూడా మరణించారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో పెళ్లయింది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు.
నాలుగు రోజుల కిందట కుమార్తె పుట్టినరోజు వేడుకలను నాగరాజు వీడియోకాల్‌లో చూసి కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపారు. అంతలోనే దుర్మరణం చెందడంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు చెందిన సుభాన్‌ఖాన్ కూడా ప్రమాదంలో మృతి చెందారు. 17 ఏళ్ల కిందట సైనికుడిగా చేరిన సుభాన్‌ఖాన్ అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానిల్ విభాగంలో పనిచేస్తున్నారు. రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా కన్నుమూయడంతో కుటుంబసభ్యులతోపాటు స్వగ్రామం కైతేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇస్లాంపూర్‌లో సుమారు వంద ఇళ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులుగా ఎంపికయ్యారు. లద్దాఖ్ సంఘటనలో చనిపోయినవారి మృతదేహాలకు సోమవారం సైనిక, పోలీసు లాంఛనాలతో స్వగ్రామాల్లో అంత్యక్రియలు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com