POLAVARAM: పోలవరం సాకారం దిశగా కీలక అడుగు

పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. పాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలు పచ్చజెండా ఊపాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5,512 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులివ్వడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధుల్లో మరో రూ.2,700 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడంతో... పనులు వేగం పుంజుకోనున్నాయి. త్వరలోనే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. 2026 మార్చి నాటికి 41.5 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన రూ.12,157.53 కోట్లు మంజూరు చేసేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026 మార్చి నాటికి వరదలు వంటి ఉత్పాతాలు ఎదురైతే మరో ఏడాది.. అంటే 2027 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షరతు విధించింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా కేంద్రం చర్యలు చేపట్టింది.
ఈ ఆర్థిక ఏడాదిలో...
ఈ అడ్వాన్స్‌తో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం.. పోలవరానికి రూ. 5,512 కోట్లు ఇచ్చినట్లు అయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014 నుంచి ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5 వేల కోట్లకుపైగా అడ్వాన్ ఇచ్చి కేంద్రం పోలవరం సాకారం దిశగా ముందడుగు పడింది. గతంలో ఎన్నడూ ఇంతవేగంగా నిధులు రాబట్టిన దాఖలాలు లేవని పోలవరం అధికారులు వ్యాఖ్యానించారు. 2024-25 బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,512.50 కోట్లు కేటాయించింది. ఇందులో అక్టోబర్ 9వ తేదీ రూ.2,807.69 కోట్లు విడుదల చేయగా, ఇప్పుడు అడ్వాన్సుగా మరో రూ.2,700 కోట్లు విడుదల చేస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో...
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.5,936 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా.. పాత నిధులు పూర్తిగా ఖర్చు చేసి, ఇప్పుడు ఇచ్చిన నిధుల్లో 75శాతం ఖర్చు చేసి పత్రాలు సమర్పిస్తే ఏప్రిల్ తర్వాత కొత్త నిధులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిధులతో ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. మార్చి 18న కేంద్ర జలసంఘంలోని డిజైన్ల విభాగం డైరెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 27న తెలంగాణ రాష్ట్రంలోని అంశాలు పరిష్కరించేందుకు ఒక సమావేశం పోలవరం అథారిటీ ఏర్పాటు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com