KUMARA SWAMY: విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే ప్రశ్నే లేదు

KUMARA SWAMY: విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే ప్రశ్నే లేదు
X
స్పష్టం చేసిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి... ప్రధానితో చర్చిస్తామని హామీ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రశ్నేలేదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ చేస్తామని ఎవరు చెప్పారని ఆయన ఎదురుప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామనే భయాలు పెట్టుకోవాల్సిన పని లేదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు. కాకపోతే ఈ విషయం వెల్లడించడానికి ప్రధాని మోదీ అనుమతి కావాలని.... ముందు ప్రధానితో మాట్లాడి ఒప్పించాల్సి ఉందన్నారు. అందుకోసం మేము విస్తృతంగా చర్చించామని... ప్లాంటును దారికి తెచ్చేందుకు సమగ్ర నివేదిక రూపొందించి ప్రధాని ముందు ఉంచుతామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తామని, అమ్ముతామని ఎవరు చెప్పారని కుమారస్వామి ప్రశ్నించారు.

ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కూటమి నేతలతో కలిసి విశాఖ స్టీలుప్లాంటును సందర్శించారు. విశాఖ స్టీలుప్లాంటు మూసివేతపై రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కుటుంబ సభ్యులెవరూ ఎలాంటి భయాలూ పెట్టుకోవాల్సిన పనిలేదని కుమారస్వామి భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ మద్దతుతో నెలన్నరలో ప్లాంటు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందన్నారు. ఉక్కు కర్మాగారం ఉత్పాదన తీరును సీఎండీ అతుల్‌భట్‌ వారికి వివరించారు. ఈడీ వర్క్స్‌ భవనంలోని మోడల్‌ గదిలోని గ్యాలరీలో ఉంచిన అవార్డులను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఆ తర్వాత వివిధ విభాగాలను సందర్శించారు. అనంతరం ఆర్‌ఐఎన్‌ఎల్‌ పనితీరుపై సీఎండీ, డైరెక్టర్లు, విజిలెన్స్‌ అధికారులు, సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ అతుల్‌భట్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విశాఖ ఉక్కు గురించి వివరించారు.

స్టీలు ప్లాంటుకు అవసరమైన మూలధనం కేంద్రం అందించాలి లేదా సెయిల్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనలను విశాఖ ఎంపీ శ్రీభరత్‌ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉక్కు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌రాయ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, సెయిల్‌ స్వతంత్ర డైరెక్టర్‌ సాగి కాశీవిశ్వనాథరాజు, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, ఆర్‌ఐఎన్‌ఎల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Tags

Next Story