NIRMALA: పోలవరం పూర్తి బాధ్యత మాదే

NIRMALA: పోలవరం పూర్తి బాధ్యత మాదే
X
అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం.. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అన్న నిర్మలా

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని విభజన చట్టంలో ఉందని.. అందువల్ల దాని నిర్మాణం కోసం తాము కచ్చితంగా సాయం చేయాలని నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. బడ్జెట్‌లో ప్రకటించిన రూ.15 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు సాయంతో ఆంధ్రప్రదేశ్‌కు తెప్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. దానికి కౌంటర్‌పార్ట్‌ ఫండింగ్‌ కూడా ఉంటుందన్నారు.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అది వారే ఇస్తారా లేదా ఇవ్వలేరా తామే కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇచ్చుకుంటామా అన్నది చూసి, వారితో మాట్లాడుకొని చేస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజధాని లేకుండా ఇప్పటికే పదేళ్లు గడిచిపోయిందని.... దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని నిర్మలా ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం ఇప్పటికే అక్కడ రాజధాని ఉండాలని... కానీ దానికి కారణం ఎవరన్న విషయం లోతుల్లోకి వెళ్లడం లేదన్నారు. రాజధాని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అన్ని జాతీయ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తుందన్నారు. 2014లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేపడుతోందని... ఈ ప్రాజెక్టు ఎత్తు, 2013 చట్టం కింద సహాయ, పునరావాసం, గ్రామాల నుంచి తరలించిన నిర్వాసితులకు చేయాల్సిన చెల్లింపులపై ఇదివరకే ఒక ఒప్పందానికి వచ్చి క్యాబినెట్‌ నుంచి అనుమతి తీసుకున్నారని అన్నారు. నిర్మాణ పనులు మొదలుపెట్టిన తర్వాత సహాయ, పునరావాస కార్యక్రమాలపై మెల్లమెల్లగా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. ఇప్పటి వరకు అంగీకరించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు డబ్బులు ఇవ్వాలో అన్నీ ఇస్తామని స్పష్టం చేశారు. కేబినెట్‌ ఆమోదించిన మొత్తాన్ని ఇప్పటి వరకూ పూర్తిగా ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. పోలవరాన్ని ఎంత ఎత్తు వరకు నిర్మించడానికి ఒప్పుకున్నారు.. అంత ఎత్తు వరకు తీసుకెళ్లడానికి ఎంతవుతుందో ఆ మొత్తం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తిగా ఇస్తామని నిర్మలా స్పష్టం చేశారు.

Tags

Next Story