AP: దేశానికే ఆహార భద్రత కల్పించే ప్రాజెక్టు... పోలవరం

AP: దేశానికే ఆహార భద్రత కల్పించే ప్రాజెక్టు... పోలవరం
X
పోలవరం ప్రాజెక్టు మేమే పూర్తి చేస్తాం... అనుమానాలు పటాపంచలు చేసిన కేంద్ర బడ్జెట్‌

పోలవరం ప్రాజెక్టుకు అండగా ఉంటామని కేంద్ర ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి గట్టి భరోసా దక్కింది. పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని, అవసరమైన నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరితగతిన నిధులిచ్చి, ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తేల్చి చెప్పింది. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదని.. యావద్దేశానికి ఆహార భద్రత అందించే కీలక ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఆశలకు కేంద్రం ఊపిరి పోసినట్లయింది.


పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చే విషయంలో ఏడెనిమిదేళ్లుగా ఎన్నో సందేహాలు ముసురుకున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే పునరావాసం, భూసేకరణ కోసమే రూ.33 వేల కోట్లు అవసరమవుతాయని 2017-18లోనే తేల్చారు. ఈ మొత్తం నిధులు ఇచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేసింది. ఒకానొక దశలో పునరావాసం, భూసేకరణలతో తమకు సంబంధం లేదని కూడా వాదించింది. అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య ఈ విషయమై వాగ్వాదం కూడా జరిగింది. 2013-14 ధరలతో నీటిపారుదల విభాగానికయ్యే వ్యయం రూ.20,398 కోట్లు మాత్రమే ఇస్తామని, అంతకు మించి ఇవ్వబోమని కేంద్రం చెబుతూ వచ్చింది. 2020 అక్టోబరులోనూ దీనిపై కేంద్ర ఆర్థికశాఖ కొర్రీ వేసి ఆ నిధులే ఇస్తామంటూ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తాజా డీపీఆర్‌ ఆమోదం పొందకపోవడంతో ఈ అంశంలో అనుమానాలు పొడచూపుతూనే ఉన్నాయి.

పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అన్ని జాతీయ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తుందన్నారు. 2014లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేపడుతోందని... ఈ ప్రాజెక్టు ఎత్తు, 2013 చట్టం కింద సహాయ, పునరావాసం, గ్రామాల నుంచి తరలించిన నిర్వాసితులకు చేయాల్సిన చెల్లింపులపై ఇదివరకే ఒక ఒప్పందానికి వచ్చి క్యాబినెట్‌ నుంచి అనుమతి తీసుకున్నారని అన్నారు. నిర్మాణ పనులు మొదలుపెట్టిన తర్వాత సహాయ, పునరావాస కార్యక్రమాలపై మెల్లమెల్లగా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. ఇప్పటి వరకు అంగీకరించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు డబ్బులు ఇవ్వాలో అన్నీ ఇస్తామని స్పష్టం చేశారు. కేబినెట్‌ ఆమోదించిన మొత్తాన్ని ఇప్పటి వరకూ పూర్తిగా ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. పోలవరాన్ని ఎంత ఎత్తు వరకు నిర్మించడానికి ఒప్పుకున్నారు.. అంత ఎత్తు వరకు తీసుకెళ్లడానికి ఎంతవుతుందో ఆ మొత్తం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తిగా ఇస్తామని నిర్మలా స్పష్టం చేశారు.

Tags

Next Story