US: అమెరికా నుంచి విద్యార్థిని మృతదేహం తెచ్చేందుకు విరాళాలు

అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి ప్రాణం పోయింది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి అనే విద్యార్థి అనారోగ్యం కారణంగా చనిపోయింది. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి.. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలలో ఉంది. అయితే ఇటీవలే కుటుంసభ్యులతో మాట్లాడిన ఆమె.. జలుబు, ఆయాసంగా ఉందని చెప్పింది. డాక్టర్ వద్దకు వెళ్లడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. అయితే ఈలోపే చనిపోయినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. మూడు రోజుల కిందట తనకు జలుబు, ఆయాసంగా ఉందని కుటుంబసభ్యులకు తెలిపింది రాజ్యలక్ష్మి. చికిత్స కోసం తొమ్మిదవ తేదీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని గురువారం రాత్రి కుటుంబసభ్యులకు ఫోన్లో చెప్పింది. ఆ తర్వాత స్నేహితులతో కలిసి నిద్రపోయింది. అయితే మరుసటి రోజు ఉదయం రాజ్యలక్ష్మి నిద్రలేవలేదు. తాము నిద్ర లేపటానికి ప్రయత్నిస్తే ఎలాంటి స్పందన లేదని.. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారని ఆమె స్నేహితులు చెప్తున్నారు. రాజ్యలక్ష్మి మరణవార్త విని ఆమె కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
నిధులు సేకరిస్తున్న భారత కమ్యూనిటీ
కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్నందువల్ల రాజ్యలక్ష్మి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి యూఎస్‌లోని భారత కమ్యూనిటీ నిధులు సేకరిస్తున్నట్లు మృతురాలి బంధువు చైతన్య పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చులకు, విద్యా రుణాలను తిరిగి చెల్లించడానికి, రాజ్యలక్ష్మి తల్లిదండ్రులకు కొంతమేర ఆర్థిక సహాయం అందించడానికి గోఫండ్‌మీ సంస్థ సాయంతో భారత కమ్యూనిటీ నిధులు సేకరిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్‌లో గల యూనివర్సిటీ ఆఫ్ న్యూహెవన్‌లో ఎంఎస్ కంప్యూటర్స్ విభాగంలో 2023లో చేరారు. ఇటీవల విద్యాభ్యాసం ముగియడంతో అక్కడే స్నేహితులతో కలిసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. రాజ్యలక్ష్మి మృతిపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

