Vaikunta Ekadasi 2022: పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 13 నుండి..

Vaikunta Ekadasi 2022: పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 13 నుండి..
Vaikunta Ekadasi 2022: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

Vaikunta Ekadasi 2022: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 13న తెల్లవారుజాము ఒంటి గంటా 45 నిమిషాల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ఈనెల 22వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవాలని వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకోనున్నారు.

శ్రీవారిని దర్శించుకుంటే పాప విముక్తి కలుగుతుందని హిందువులు భావిస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు.. శ్రీవారిని ఉత్తర ద్వారం దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు. ఇందుకోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లను చేపట్టింది. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు అందుబాటులో ఉంచింది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీవీఐపీ, వీఐపీలకు మొదట ప్రాధాన్యం కల్పిస్తారు. స్వయంగా వచ్చే వారికి టిక్కెట్లు కేటాయిస్తారు. అలాగే వీవీఐపీ, వీఐపీలు పంపే సిఫార్సు ఉత్తరాలు టిక్కెట్లు కేటాయించమని టీటీడీ ప్రకటించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కింద రోజుకు 20 వేల చొప్పున పది రోజులకు 2 లక్షల టోకెన్లు, సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు రోజుకు 5వేల చొప్పున 50 వేలతో పాటు శ్రీవాణి సేవా టికెట్లను ఆన్ లైన్‌లో విడుదల చేశారు.

గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా స్థానికులకు తిరుపతిలో టోకెన్లను జారీ చేయనున్నారు. ఒమైక్రాన్, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో స్థానికులకు మాత్రమే 10 రోజులకు సంబంధించి టోకెన్లను ఒకేసారి 50 వేల టోకెన్లను జారీ చేయనున్నారు. రోజువారి 5 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చేందుకు మాత్రమే టోకెన్లు తీసుకుని స్వామివారి దర్శనానికి రావాల్సి ఉంటుంది.

ఇందు కోసం తిరుపతిలో 5 కేంద్రాలను ఎంపిక చేశారు. తిరుపతి మున్సిపల్‌ ఆఫీసు సమీపంలో ఒక కేంద్రం, రామచంద్ర పుష్కరణి దగ్గర మరొకటి, ఎంఆర్‌ పల్లిలోని జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో టోకెన్ల జారీ కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్‌లో ఒకటి, జీవకొనలోని జెడ్పీ స్కూల్‌నూ టోకెన్ల కేంద్రంగా ఎంపిక చేశారు.

Tags

Read MoreRead Less
Next Story