VAMSHI: జైలుకు వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. విజయవాడ కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం వల్లభనేనిని పోలీసులు జైలుకు తరలించారు. ఇదే కేసులో మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7గా శివరామ కృష్ణప్రసాద్, ఏ8గా నిమ్మ లక్ష్మీపతిగా చేర్చారు. వీరికి కూడా కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సందర్భంగా వ్యక్తిని కిడ్నాప్ చేశారని వంశీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో 8 గంటల పాటు విచారించారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం న్యాయమూర్తి వంశీకి రిమాండ్ విధించారు.
వంశీ దుందుడుకు వల్లే ఇదంతా..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిజానికి ఈ కేసులో ఏ 7 గా ఉన్న వల్లభనేని వంశీ.. తన దుందుడుకు చర్యల వల్లే A1 గా మారారని.. ఇది అతని స్వయంకృతాపరాదమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పిటిషనర్ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేయించి, బెదిరించి, డబ్బు ఆశ చూపించి కేసు వెనక్కి తీసుకునేలా చేసి వంశీ పెద్ద తప్పు చేశారన్న ప్రచారం జరుగుతోంది.
వంశీ ఒక పెద్ద సైకో: టీడీపీ
వల్లభనేని వంశీ ఒక పెద్ద సైకో అని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధికారి ప్రతినిధి సురేంద్ర కుమార్ విమర్శించారు. తనకు రాజకీయ జన్మ ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ, అటువంటి పార్టీ కార్యాలయం మీద 100 మందితో దాడి చేయించి విధ్వంసం సృష్టించాడు. కార్యాలయం లోపల ఉన్న కంప్యూటర్లను, ఫర్నిచర్ ధ్వంసం చేశారని అన్నారు.
నేరాలకు కేరాఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ: ప్రత్తిపాటి
వల్లభనేని అరెస్ట్ ఎప్పుడాని రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం చిలకలూరిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నేరాలకు కేరాఫ్ అడ్రస్ వంశీ అన్నారు. వంశీని ఒక మనిషా, పశువా, మృగమా అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని, ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు, లోకేశ్ మీద మాట్లాడిన భాష మీద సభ్య సమాజం వంశీకి ఏ శిక్ష వేసిన ప్రజలు ఆమోదింప చేస్తారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com