Vanama Raghavendra Rao: రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో రాఘవేంద్ర రావుకు రిమాండ్..

Vanama Raghavendra Rao: పాల్వంచ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్‌హాట్‌గా మారింది. రామకృష్ణ ఫ్యామిలీ సుసైడ్ కేసులో A2 నిందితుడు వనమా రాఘవేంద్రకు కొత్తగూడెం మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించటంతో.. భారీ భద్రత నడుమ భద్రాచలం సబ్‌జైల్‌కు తరలించారు. జైల్ మొదటి బ్యారక్‌లోని సాధారణ అండర్ ట్రయల్ ఖైదీగా రాఘవను ఉంచారు.
అంతకుముందు వనమా రాఘవేంద్రను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు.. శుక్రవారం దమ్మపేట మండలం మందలపల్లి వద్ద కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం రాఘవేంద్రను ఏఎస్పీ ఆఫీసులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడే రాఘవేంద్రకు వైద్యపరీక్షలు నిర్వహించారు. రాఘవేంద్రతోపాటు ఆయన స్నేహితులు గిరీష్, మురళీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పరారీకి సాయపడిన శ్రీనివాస్, రమాకాంత్ సహా నలుగురిపై కేసులు నమోదు చేశారు.
నాగ రామకృష్ణను బెదిరించినట్లు రాఘవేంద్ర అంగీకరించినట్లు మీడియా సమావేశంలో ఏఏస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. పాల్వంచ టౌన్ పీఎస్‌లో రాఘవేంద్రపై ఐపీసీ 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్న ఏఎస్పీ.. ఇప్పటి వరకు 12 కేసులున్నాయన్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు, బాధితుడి ఆత్మహత్య లేఖ, సెల్ఫీ వీడియోలో.. రాఘవేంద్రతోపాటు తల్లి, సోదరి కారణంగానే చనిపోతున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారని ఏఏస్పీ వెల్లడించారు.
కేసులన్నీ దర్యాప్తులో ఉన్నందున పూర్తివివరాలు వెల్లడించలేమన్న ఏఏస్పీ.. బాధితులు ఎవరున్నా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలన‌్నారు. అటు రామకృష్ణ ఫ్యామిలీ సుసైడ్‌లో రాఘవేంద్రపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మరెన్నో వివాదాలు, అరాచకాలకు కేంద్ర బిందువుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com